
అచ్చ ట్లు తీరని ఆండాలమ్మ ముచ్చట్లకు పోయిందట
భూమ్మీదున్న జీవజాలంలో ఒక్కో జీవం ఒక్కోరకం. ఒక్కోదానిది ఒక్కో బుద్ధి. వీటిలో పరాన్నజీవులు అనే రకమొకటుంది. వీటిది విలక్షణమైన స్వభావం. ఇతర జీవుల మీదే ఆధారపడి బతుకుతుంటాయి. ఈ రకం పరాన్న జీవులు కొన్ని మానవజాతి లోనూ ఉన్నాయి. మనకు అక్కడక్కడా తారస పడు తుంటాయి. సాధారణంగా మనుషులకు ఆకలి ఎక్కువున్నట్లే ఈ పరాన్న జీవులకి కడుపుమంట ఎక్కువ. ఇలాంటి జీవులు సైట్లలో దూరి పోయాయి. అదేనండీ కాకమ్మ కబుర్లు.. అమ్మమ్మ ముచ్చట్లు టచెబుతుంటాయే … అలాంటి వెబ్ సైట్లన్న మాట. గబ్బు కొడుతుందేంటబ్బా అని పరికించి…ఆరాతీసి చూస్తే అప్పుడు తెలిసింది. అక్కడ పరాన్నజీవులు ఆకలి మంటతో.. అదేనండీ కడుపు మంటతో గిలగిలా కొట్టుకుంటు కనిపించాయి. మొదట నాకు అయ్యో పాపం అనిపించింది. కంగారు పడ్డాను. నా మిత్రుడొకడు చెప్పాడు. వాటి శాపగ్రస్త జన్మ రహస్యం గురించి. అప్పుడు కానీ నా మనసు కుదుట పడలేదు. ఈ పరాన్న జీవులు వాటి బతుకు అవి బతకలేవు. అలాగే వాటి ఏడుపు కూడా అవి ఏడవ లేవు. అదెలాగంటే..సంతోషంగా ఉండే వాడిని చూడగానే వీటికి ఆటోమేటిక్ గా కడుపుమంట వచ్చేస్తుంది. దాన్ని చల్లార్చుకునేందుకు ఎదుటి వాడిని గిల్లేస్తాయి. వాడు కెవ్వు మనగానే వాటితోపాటు ఇవీ ఏడ్చేస్తాయి. వీటిది అంత దరిద్రమన్న మాట.
ఈమధ్య కాలంలో ఇలాంటోళ్లు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారు. ఇక న్యూస్యూ.. వ్యూసూ… రివ్యూసూ… పేరుతో పూట గడుపుకునే సైట్లలో నిత్యం వీళ్ల ఫీట్లే. చెడు అనకు… చెడు వినకు.. చెడు కనకు .. అన్న చందంగా ఈ పరాన్నభుక్కులు నిజం కనలేవు.. వినలేవు … అన లేవు.. వీటిది అంతా ట భాష. అవునట.. చెప్పారట… జరిగిందట.. ఏమోనట… ఇలా ఒంటి కాలి కుంటి నాట్యాన్ని మాట. ఒక్కమాట చెప్పాలంటే జేబులు నింపుకునేందుకు చేతులు తడుపుకునే ఉద్యోగుల్లాగే వీళ్లు నిజాలు మాట్లాడేందుకు లాగులు తడుపు కుంటారు. అందుకే ఎప్పుడూ గ్యాసిప్సు మీదే బతుకుతుంటారు. వయసు మల్లి… చేవచచ్చి.. బుర్రలో గుజ్జరిగి.. చత్వారం మనసుతో అరుగు మీద ఆండాలమ్మ కబుర్లు చెబుతుంటారు.
వార్తకీ.. కథనానికి… వార్తకీ అభిప్రాయానికీ.. వార్తకీ విశ్లేషణకీ తేడా తెలీకుండా.. సుద్దులు వల్లె వేస్తుంటారు. నిజం చెప్పడానికి.. రాయడానికి వీళ్లకు గొంతు లేవదు.కలం కదలదు. దురదృష్టవశాత్తు ఇలాంటోళ్లంతా జర్నలిజంలో అపర బ్రహ్మలు. ఎక్కడ కాటేస్తుందో అనే భయంతో నిజాన్ని మూటగట్టి బొడ్లో దోపుకునే ఇలాంటి ధీశాలుల్ని చూస్తుంటే జాలేస్తుంది. కొన్నిసార్లు చీడపీడల్ని చూసినట్టు ఒళ్లు జలదరిస్తుంది. వెనకటికి ఓ గవర్నర్ ఒళ్లు తిమ్మిరెక్కి ఏదో చేస్తే.. జర్నలిజం ముసుగేసీన ఇలాంటి పండితులు కళ్లూ.. నోళ్లూ .. కాదు కాదు నవరంధ్రాలూ మూసుక్కూర్చున్నారు. ఆ సమయంలో దమ్మున్న ఛానలొకటి రొమ్ము విరిచి ముందుకొచ్చి సదరు గవర్నర్ రాసలీల బాగోతం దుమ్ముదులిపింది. ఆ తర్వాత కాలంలో అలా నిజాన్ని నిప్పుతో కడిగిన కథనాలు చాలా అరుదనే చెప్పాలి. పెద్దలు కదా.. ఏం చేసినా చెల్లుబాటంటే ఎలా… ప్రజాస్వామ్యం లోనూ బానిస ఆలోచనలే. ఏమన్నా అంటే జర్నలిజానికి బొడ్డుకోసి పేరు పెట్టింది మేమే అంటారు… రామోజీ లాంటోళ్ల సంస్థలకు ఊపిరిలూదింది మేమే అని గొప్పలు పోతుంటారు. వాస్తవాన్ని వాస్తవం అని చెప్పడానికి మూర్ఛరోగుల్లా గిలగిల్లాడి పోతారు. అవాకులు..చవాకులు…కట్టు కథలు… కుళ్లు నీతులు చెప్పమంటే సొంత కార్ చేస్తారు. వాస్తవాలతో పనిలేదు…వీళ్ల బతుకంతా గూగులోడి వ్యూస్ లెక్కల్లోనే. అయినా నేటి రాజకీయాల్లో హరిశ్చంద్రులెవరు. వాళ్ల నీతులు నేతిబీరలన్నది జగమెరిగిన సత్యం.
ఏదేమైనా జర్నలిజం పేరిట సైట్లలో దూరిన పరాన్న జీవులు సమాజానికే చేటు. ఇదే విషయాన్ని నా మిత్రుడితో చర్చించాను. వాడు ఒకమాట చెప్పాడు. అచ్చట తీరని ఆండాళ్లమ్మ ముచ్చట పోయిందట అని. ఈ పరాన్నజీీవుల్ని బుద్ది గురించి వాడి క్వటేషన్ కరెక్టు కదా అనిపించింది. పరాన్న జీవుల నుంచి పవిత్ర సూక్తులు ఆశించడం అవివేకమే .. ఇది నిజమే సుమీ..
PVR