విజయవాడ: మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేందుకు ‘విజయవాడ ఉత్సవ్’ తోడ్పడుతుంది, దసరా ఉత్సవాలంటే ఇప్పటివరకు మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడుకునేవారని, ఇకపై దసరా ఉత్సవాలంటే ‘విజయవాడ ఉత్సవ్’ గురించి మాట్లాడుకునేలా వేడుకలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ లో నిర్వహించిన ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు గారితో కలిసి విజయవాడ ఉత్సవ్ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. జై భవాని. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్య భూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. దుర్గమ్మ ను దర్శించుకొని ఏ పని స్టార్ట్ చేసినా విజయమే. వెంకయ్యనాయుడు ని చూస్తూ పెరిగాను. ఆయన పట్టుదలను చూస్తే ఏమైనా సాధించవచ్చని అనిపిస్తుంది. ఆంధ్రా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా తన ప్రయాణం ప్రారంభించారు. ఎమ్మెల్యే, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు. తెలుగుభాషను కాపాడేందుకు అహర్నిరిశలు కృషిచేశారు. ఆయన పోరాటం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో జీవోలన్ని తెలుగులో ఇవ్వడం జరుగుతోంది.
వాజ్ పేయి, అద్వానీ, మోడీ తో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు వెంకయ్యనాయుడు
నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యేవరకు వదిలిపెట్టరు. నాయుడు గారిపై మాటలతో, వాదనలతో గెలిచిన వారు ఎవరూ లేరు. మనం ఎవరం మాట్లాడినా పది నిమిషాల తర్వాత బోర్ కొడుతుంది. కానీ వెంకయ్యనాయుడు గారు గంట సేపు ఉపన్యాసం ఇచ్చినా బోర్ కొట్టదు. అందరినీ నవ్విస్తూ ఉంటారు. వయసు ఒక సంఖ్య మాత్రమే. ఆయన స్పీడ్ చూసి ఈ రోజు కూడా నేను అసూయ పడుతున్నాను. ఎప్పుడు చూసినా పనితప్ప వేరే ఆలోచనలు ఆయనకు ఉండవు. గౌరవ సీఎం గారితో పోటీ పడాలని అనుకుంటున్నా.. నా వల్ల కావడం లేదు. అదే పరిస్థితి గౌరవ వెంకయ్యనాయుడు గారితో కూడా ఉంది. స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారు. వాజ్ పేయి, అద్వానీ, మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు.

