గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యం

pavan kalyan
Spread the love

73 వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలు

ఆర్ డి ఓ స్థాయిలో పంచాయతీరాజ్ డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లు

డి డి ఓ కార్యాలయ ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమీకృతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ

పంచాయతీరాజ్ పాలనాపరంగా సంస్కరణలు తీసుకువచ్చి వచ్చి సుమారు 10 వేల మందికి పదోన్నతి కల్పించాం

డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్

చిత్తూరు, డిసెంబర్ 04: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో భాగంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి డివిజన్ స్థాయిలో డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

   గురువారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి చిత్తూరు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసులను డిప్యూటీ సిఎం కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 

   ఈ కర్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వి.ఆర్ కృష్ణతేజ మైలవరపు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు, పూతలపట్టు, తిరుపతి, కోడూరు ఎంఎల్ఏ లు గురజాల జగన్మోహన్, కె. మురళిమోహన్, ఆరణి శ్రీనివాసులు, ఆరవ శ్రీధర్, నగర మేయర్ అముద, చూడ చైర్పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎం ఎల్ సి రాజసింహులు, ఇతర ప్రజా పతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

  ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి సహాయ సహకారాలు అందుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలలో పలు సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చామని, ఇందులో భాగంగా రాష్ట్రంలో 77 డివిజినల్ డెవలప్మెంట్ ఆఫీసులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యాలయాల్లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి డిడిఓ, డి ఎల్ పి ఓ, ఏపిడి, డ్వామా ఇతర అధికారులు సేవలందించనున్నారన్నారు. డివిజినల్ డెవలప్మెంట్ కార్యాలయాల ఏర్పాటుతో ప్రతి పంచాయతీ స్వయం ప్రతిపత్తి కలిగి స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీర్చగలమని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాల ను సమీకృతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ చేయవచ్చున్నారు. 

     గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలలో పని చేస్తున్న అధికారుల పదోన్నతులకు సంబంధించి అనేక సమస్యలు ఉండేవని, గ్రూప్ 1 ద్వారా ఎంపిడిఓ లుగా నియమితులైన వారు కూడా 22 ఏళ్ల వరకు పదోన్నతి లేకపోవడం, సీనియార్టీ సమస్యల కారణంగా పదోన్నతులు లేకుండా ఇబ్బందులు పడేవారన్నారు. వీటిని పరిష్కరించి సుమారు 10 వేల మందికి పైగా పదోన్నతులు కల్పించామన్నారు. జిల్లా పరిషత్ విభాగాన్ని, జిల్లా పంచాయతీ విభాగాన్ని ఏకీకృతం చేశామన్నారు. అలాగే డిపిఓ స్థాయి అధికారి ని డిప్యూటీ డైరెక్టర్ గా పెంచామన్నారు. 

   గ్రామ స్థాయిలో 7,244 క్లస్టర్ లను రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలను స్వయం పాలన సంస్థలుగా మార్చి, ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రెటరీని నియమించామన్నారు. 10 వేలు జనాభా దాటిన గ్రామ పంచాయతీలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్ ను పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించామన్నారు. ప్రస్తుతం ఉన్న 5 గ్రేడ్ల పంచాయతీ సెక్రెటరీలను మూడు గ్రేడ్ లుగా చేస్తూ పంచాయతీ సెక్రెటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చామన్నారు. పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక ఐ టి వింగ్ ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రజలకు మెరుగైన సేవలను ప్రజలకు అందించడానికి అధికారులు కంకణబద్ధులై ఉండాలని ఆశిస్తున్నానన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *