ప్ర‌గ‌తి నావ ప‌య‌నాన్ని ప‌రుగులు పెట్టిద్దాం..

telugu track
Spread the love

తెలుగు ట్రాక్,విజయవాడ:
ఏడాది కాలంలో స‌మ‌ష్టి కృషితో ఎన్నో విజ‌యాల‌ను సొంతం చేసుకున్నామ‌ని.. ఈ ప్ర‌గ‌తి ప‌థం స్ఫూర్తిగా ఇక‌పైనా స‌రైన విశ్లేష‌ణ‌తో వినూత్నంగా జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి ముంద‌డుగు వేద్దామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.
మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎంతో క‌లిసి కీల‌క ప్ర‌గ‌తి సూచిక‌ల‌(కేపీఐ)తో పాటు జిల్లా అభివృద్ధికి, ప్ర‌జ‌ల క్షేమం, సంక్షేమానికి ఏడాది కాలంగా చేపట్టిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు, సాధించిన విజ‌యాలు, వాటి స్ఫూర్తితో కొత్త ఏడాది కార్యాచ‌ర‌ణ‌పై స‌మీక్షించారు. 12 నెల‌ల కాలంలో మైలురాళ్లను గుర్తుకు తెస్తూ వ‌చ్చే ఏడాదిలో స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుంటూ ముందుకెళ్లాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను ఉద్ఘాటించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్ర‌భుత్వ ప్రాధాన్యాత‌ల‌కు అనుగుణంగా, స్వ‌ర్ణాంధ్ర ల‌క్ష్యాల‌ను చేరుకునే క్ర‌మంలో సంక్షేమ ప‌థ‌కాల స‌మ‌ర్థ అమ‌లుతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని కాంక్షిస్తూ చెప్పుకోద‌గ్గ ఫ‌లితాలు సాధించామ‌ని.. కేపీఐలో రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిలవ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. యోగాంధ్ర సంద‌ర్భంగా ప్ర‌పంచ రికార్డుల న‌మోదు, స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ జాతీయ‌స్థాయి పుర‌స్కారాలు, ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధి సూచిక‌ల్లో నీతి ఆయోగ్ బంగారు ప‌త‌కాలు.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో గుర్తింపులు సాధించామ‌న్నారు. భారీ కార్య‌క్ర‌మాల‌తో పాటు ద‌స‌రా ఉత్స‌వాలు, విజ‌య‌వాడ్ ఉత్స‌వ్‌ను ఘ‌నంగా నిర్వ‌హించి టీమ్ ఎన్‌టీఆర్ గౌర‌వ సీఎంగారి ప్ర‌శంస‌లు సైతం అందుకుంద‌న్నారు. వీటిని స్ఫూర్తిగా తీసుకొని కొత్త ఏడాదిలోనూ జీడీడీపీ, జీవీఏ, త‌ల‌స‌రి ఆదాయం వంటి ఆర్థిక సూచిక‌ల్లోనూ ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు కృషిచేద్దామ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.
ప్ర‌తి కీల‌క ప్ర‌గ‌తి సూచిక‌లో (కేపీఐ)లో ఏ+ గ్రేడ్ మ‌న ల‌క్ష్య‌మ‌ని.. సాధించిన స్కోరు ప్ర‌కారం న‌వంబ‌ర్ వ‌ర‌కు చూస్తే ఎ.కొండూరు మండ‌లం 129 సూచిక‌ల్లో 92 స్కోరుతో, నందిగామ 136 సూచిక‌ల్లో 90 స్కోరుతో, తిరువూరు 124 సూచిక‌ల్లో ఏ ప్ల‌స్ గ్రేడ్ సాధించాయ‌ని తెలిపారు. ప్ర‌తి మండ‌లం, ప్ర‌తి సూచిక‌లోనూ ఏ ప్ల‌స్ గ్రేడ్‌ను చేరుకునేందుకు మ‌రింత కృషిచేయాల‌ని సూచించారు. ఈ సూచిక‌ల‌పై ప్ర‌తి శాఖా ప్ర‌త్యేకంగా దృష్టిసారించి స‌మీక్షించుకుంటూ ప్ర‌గ‌తి దిశ‌గా ప‌య‌నించాల‌న్నారు. వ్య‌వ‌సాయ రుణాలు, ప్ర‌కృతి సాగు విస్తీర్ణం, పంట‌ల బీమా, ఉద్యాన పంట‌ల సాగు విస్తీర్ణం వంటి అంశాల‌పై దృష్టిసారించాల‌న్నారు. ప‌శువుల షెడ్లు, పాడి అభివృద్ధి, ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేష‌న్‌, వ‌స‌తి గృహాల్లో విద్యార్థుల న‌మోదు, ర‌హ‌దారుల నిర్మాణం, పున‌రుద్ధ‌ర‌ణ‌, స్వ‌చ్ఛ‌తా ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆరోగ్య కార్య‌క్ర‌మాల అమ‌లు త‌దిత‌రాల‌కు సంబంధించిన సూచిక‌ల‌పైనా ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన తదితర రంగాలలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స‌మావేశంలో సీపీవో వై.శ్రీల‌త‌, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *