
గతంలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పాత నగరాన్ని పట్టించుకోకుండా స్వలాభం కోసమే పనిచేశారని చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ముజీబుల్లా విమర్శించారు. ఒకసారి అవకాశమిస్తే పాత నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఓల్డ్ సిటీ లో కేవలం మత రాజకీయాలకే ప్రాధాన్యమిస్తుండటం వల్లనే పాత నగరంలో అభివృద్ధి కుంటుపడిపోయిందని మహమ్మద్ ముజీబుల్లా షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన చార్మినార్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేపట్టారు. ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు స్థానిక ప్రజలు హారతులిచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాతనగరంలో ఎం ఐ ఎం మత రాజకీయాలకు పాటుపడుతూ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం అందించాలని అయన విజ్ఞప్తి చేశారు.