ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలు
సైలెంట్ పీరియడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కౌంటింగ్ ప్రారంభమైన 12 గంటల్లోపు ఫలితాల ప్రకటనకు ముందస్తు ఏర్పాట్లు
.
రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా
తెలుగు ట్రాక్,విజయవాడ:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా సూచించారు. ఎన్నికల ప్రక్రియపై ఓటర్లలో పూర్తి విశ్వాసం కలిగించేలా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, నిబంధనల ఉల్లంఘనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా, ఐజీ రాజకుమారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మల్లికార్జున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రత, పోలింగ్ కేంద్రాల తనిఖీలు, సిబ్బంది రవాణా తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సమావేశంలో ఎన్.టి.ఆర్. జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ, ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ కుమార్, జెడ్పీ సీఈఓ పి.సుశీల, డీపీఓ సీతా మహాలక్ష్మి, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, అధికారుల మధ్య సమన్వయం కీలకమని తెలిపారు. గతంలో కడప జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవాలను ప్రస్తావిస్తూ, క్షేత్రస్థాయి పర్యటనలు, నిరంతర సమీక్షల ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల్లో క్యూ లైన్లు, సిబ్బందికి గది వసతులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, సిబ్బంది రవాణాకు అవసరమైన వాహనాలు, రూట్ చార్టులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, భవనాలకు జరిగిన నష్టాలను వెంటనే సరిచేయాలని తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలలోపు అన్ని పోలింగ్ కేంద్రాల భౌతిక తనిఖీలు పూర్తి చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. సున్నిత, అత్యంత సున్నిత కేంద్రాల్లో ఓటు రహస్యతకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మైక్రో అబ్జర్వర్ల విధుల నిర్వహణ, నివేదికల సమర్పణను పర్యవేక్షించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి సైలెంట్ పీరియడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రచారం, మద్యం సరఫరాపై నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక ఓటర్లు కాని రాజకీయ నాయకులు, బయటి వ్యక్తులు నియోజకవర్గ పరిధిలో ఉండకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, గెస్ట్ హౌస్‌లు, కల్యాణ మండపాలు, ఇతర వసతి కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు రెండు విడతలుగా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, కౌంటింగ్ ప్రారంభమైన 12 గంటల్లోపు ఫలితాలు ప్రకటించే లక్ష్యంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రతి శాఖ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ఓటర్లకు పూర్తి భద్రత కల్పిస్తూ ఎన్నికల ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.
