మరో వివాదంలో స్టాలిన్

Spread the love

హిందీపై స్టాలిన్‌ విసుర్లు

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి ఉదయనిధిని టార్గెట్‌ చేస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే…హిందీ దినోత్సవం సందర్భంగా కేంద్రహోం మంత్రి అమిత్‌షా చేసిన ట్వీట్‌పైనా ఉదయనిధి తీవ్రంగా స్పందించడం మరో వివాదానికి తెర తీసింది. దేశంలోని అన్ని భాషల్ని ఏకం చేసేది హిందీ అని, స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఇప్పటి వరకూ దేశ అభివృద్ధిలో హిందీ పాత్ర కీలకం అని ట్వీట్‌ చేశారు అమిత్‌ షా. అధికార భాష అయిన హిందీతో పాటు అన్ని భాషల్నీ కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.దీనిపైనే ఉదయనిధి స్టాలిన్‌ మండి పడ్డారు. ట్విటర్‌లో తమిళంలో సుదీర్ఘమైన పోస్ట్‌ చేశారు. అన్ని భాషల్ని హిందీ ఎలా కలుపుతుందని, బలవంతంగా ఆ భాషను రుద్దడం ఆపేయాలని తేల్చి చెప్పారు. హిందీ మాత్రమే గొప్పదనే భావజాలం నుంచి బీజేపీ బయటపడాలని అన్నారు. హిందీ చదివితేనే అభివృద్ధి చెందొచ్చు అనే అర్థం వచ్చేలా మాట్లాడడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. ‘‘హిందీ దేశ ప్రజల్ని ఏకం చేస్తుందని, స్థానిక భాషల్ని బలోపేతం చేస్తుందని అమిత్‌షా చెప్పడమేంటి..? ఎప్పటిలాగే ఆయన మరోసారి హిందీపైన తనకున్న ప్రేమని చాటుకున్నారు. హిందీ చదివితే కానీ గొప్పవాళ్లం కాలేవన్న అర్థంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి..? తమిళనాడులో తమిళం మాట్లాడతారు, కేరళలో మలయాళం మాట్లాడతారు. మరి ఈ రెండు రాష్ట్రాలను హిందీ ఎలా కలుపుతుంది..? సాధికారత ఎలా సాధిస్తారు..? కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాష…మొత్తం దేశ ప్రజల్ని ఒకటి చేస్తుందని చెప్పడం వింతగా ఉంది. మిగతా భాషల్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదని మంత్రి ఉదయనిధి అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: