ఛత్తీస్ ఘడ్ నుండి వచ్చి ఏపీలో మకాం
అక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాల గాలింపు
విజయవాడలో 28 మంది నక్సల్స్ అరెస్ట్
ఏలూరు,కాకినాడలోనూ పలువురు మావోలు అరెస్ట్..

తెలుగు ట్రాక్,విజయవాడ:
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ జరగటంతో విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో
విజయవాడ నగరంలో భారీగా 28 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిలో అధికంగా మహిళలే ఉన్నారు. . కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 27 మంది మావోలను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కృష్ణా ఎస్పీ విూడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడిరచారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ అనంతరం కొత్త ఆటోనగర్‌లో 27 మందిని అదుపులోకి తీసుకున్నామని.. ఇది చాలా మేజర్ ఆపరేషన్ అని చెప్పారు. సెంట్రల్ కమిటీ అధ్యక్షులు . దేవ్ జీ , అతనితో పాటు ఉన్న తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీంను పట్టుకున్నామన్నారు. మిగతా వారు కూడా నక్సల్ ఆపరేషన్‌లో కీలకంగా ఉన్నట్లు చెప్పారు. డీజీపీ పర్యవేక్షణలో ఈ మొత్తం నడిచిందని తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం డీజీపీ వెల్లడిస్తారని అన్నారు.వీరి వద్దనుండి భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచే వారంతా వివిధ మార్గాల్లో విజయవాడకు వచ్చినట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారన్నారు. రాష్ట్ర పోలీసుకు వచ్చిన సమాచారంతో ఈ ఆపరేషన్ మొత్తం సాగిందని తెలిపారు.హిడ్మా ఇక్కడ నుంచే వెళ్లారనేది ఇంకా స్పష్టత లేదని ఎస్పీ అన్నారు. వారందరినీ పూర్తిగా విచారణ చేశాక వివరాలు తెలుపుతామని.. పోలీసులకు ఉండే ఫోర్స్‌తో వారు ఎదురు తిరిగలేరన్నారు. ఐదు జిల్లాల్లో నేడు ఈ ఆపరేషన్ జరిగిందని.. కృష్ణా జిల్లా పరంగా తమ ఆపరేషన్ వివరాలు తెలియజేసినట్లు చెప్పారు. డేటా మొత్తం తీసుకుని, విచారణ ముగిశాక అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ఇది ఇండస్టియ్రల్ ఏరియా అని.. లేబర్ చాలా మంది ఉంటారని తెలిపారు. బయటి రాష్టాల్ర నుంచి వచ్చే వాళ్ల లాగానే మావోయిస్టులు కూడా వచ్చారని.. తమకు సమాచారం వచ్చాక నిఘా పెట్టి నేడు పట్టుకున్నామని వెల్లడిరచారు. గన్నవరం, పెనమలూరు, కంకిపాడు పోలీసు టీంలు పాల్గొన్నాయన్నారు. మావోయిస్టులు ఏదో ప్రణాళికతోనే ఇక్కడ మకాం వేశారని.. అన్ని విషయాలు విచారణ అయ్యాక చెబుతామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు.
అలాగే ఏలూరులో 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని పరిణామాలతో మావోయిస్టులు ఏపీకి రావాలని చూస్తున్నారని మహేశ్ చంద్ర తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. మావోయిస్టుల కదలిలకపై ఇంటెలిజెన్స్ నుంచి రెండు రోజుల క్రితం పక్కా సమాచారం వచ్చిందని చెప్పారు. మావోయిస్టులు ఏపీ నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని చూశారని వెల్లడిరచారు. అలాగే ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని మహేశ్ చంద్ర తెలిపారు. అరెస్టయిన వారిలో 9 మంది మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్‌జీ అనుచరులుగా గుర్తించామని వెల్లడిరచారు. మిగిలినవారంతా సౌత్ బస్తర్ జోనల్ కమిటీ సభ్యులు అని పేర్కొన్నారు.
