శాంతిభద్రతలపై రాజీ లేదు

chandrababu today press meet
Spread the love
  • జగన్‌ మూలంగానే మాఫియాలు
  • జగన్‌కు దేవుడన్న లెక్క లేదు
  • శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్‌ వ్యాఖ్యలు
  • పరకామణి దొంగతనం చిన్నది ఎలా అవుతుంది
  • విూడియా చిట్‌చాట్‌లో సిఎం చంద్రబాబు నాయుడు

తెలుగు ట్రాక్,అమరావతి,డిసెంబరు6:
శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మాట్లాడే తీరు అంటూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై మండిపడ్డారు. శనివారం అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్ర బాబు పార్టీ నేతలతో పలు కీలక అంశాలపై మాట్లాడారు. అనంతరం విూడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చిట్‌చాట్‌ చేశారు. శ్రీవారి పరకామణి దొంగతనం వ్యవహారంపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను విూడియా ప్రతినిధులు ప్రస్తావించారు. పరకామణి దొంగతనం చిన్న దొంగతనం అంటూ జగన్‌ వ్యాఖ్యలు అందరినీ విస్తుగొలిపాయని చెప్పుకొచ్చారు. జగన్‌కు దేవుడన్నా లెక్కలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలన్నా లెక్కలేదని… ఆలయాలు పవిత్రత అన్నా లెక్కలేదని ధ్వజమెత్తారు. ’జగన్‌ తన బాబాయి వివేకా హత్యనే సెటిల్‌ చేసుకుందామని చూశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్‌ చేయాలని చూశారు.. ఇంతకంటే ఘోరం ఉంటుందా? దొంగతనాన్ని కూడా తప్పు కాదని చెప్పే వాళ్లను ఏమనాలని ఆగ్రహం చెందారు.సెంటిమెంట్‌ విషయాల్లో కూడా సెటిల్‌మెంట్‌ అంటూ వ్యాఖ్యాలా.? దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు తిరిగి కట్టాడు కదా…తప్పేముందని జగన్‌ అత్యంత అనైతికంగా వాదిస్తున్నారు. భక్తులు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోనూ భక్తుల సెంటిమెంట్‌ ముడిపడి ఉంటుంది. అలాంటి సున్నిత అంశాలను కూడా సెటిల్‌చేశామని తేలికగా జగన్‌ మాట్లాడుతున్నారు. భక్తుల ఇచ్చిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్‌మెంట్‌ ఏంటని అన్నారు. శ్రీవారి హుండీలో చోరీపై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై అన్నివర్గాల ప్రజల్లోనూ తీవ్ర ఆవేదన కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. రూ.72 వేలు అనేది చిన్న దొంగతనమని చెబుతున్నాడు. దేవుడు హుండీలో చోరీ చిన్న తప్పా? దాన్ని సెటిల్‌ చేయడం మహాపాపం కాదా? కోట్ల మంది భక్తుల విశ్వాసాలు దెబ్బతీసేలా పరకామణి విషయంలో జగన్‌ ఇలాంటి వ్యాఖ్యలు ఘోర పాపం కాదా’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.ఏమాత్రం నైతికత లేని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. తిరుమల పరకామణిలో రూ.70వేల చోరీకి రూ.14కోట్ల ఆస్తి రాసిచ్చేందుకు సిద్ధపడ్డారంటే ఇంకెంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు. తితిదేలో దోపిడీ ఏ స్థాయిలో చేశారో దీనిబట్టే అర్థమవుతోందన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్‌కు దేవుడన్నా, ఏడుకొండల వాడి భక్తుల మనోభావాలు అన్నా, ఆలయాలు పవిత్రత అన్నా లెక్కలేదని దుయ్యబట్టారు. చుక్క పాలు లేకుండానే నెయ్యి తయారు చేసి దేవుడి ప్రసాదానికి సరఫరా చేసిన ఘనులా వీళ్లు అని సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవి.. వైకాపా హయాంలో నెల్లూరులో కూడా చాపకింద నీరులా మాఫియాను విస్తరింపజేశారు. లేడీడాన్స్‌ తయారవటం చూసి నాకే ఆశ్చర్యం కలిగింది. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశా. శాంతి భద్రతలు అదుపు చేస్తున్నాం. అధికారం చేపట్టిన నాటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. రాజధానిలో సమస్యలన్నీ పరిష్కారమై అభివృద్ధి జరుగుతుంటే రైతులు, ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *