రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చొరవ
జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
తెలుగు ట్రాక్,విజయవాడ:
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగుతోందని, రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నారని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు.
ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియ గురువారం తిరువూరు ఆర్‌డీవో కె.మాధురితో కలిసి విస్సన్నపేట, గంపలగూడెం, పెదకొమిరలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తనిఖీ చేశారు. స్థానిక రైతు సేవా కేంద్రాలను సందర్శించి రైతులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రైతులకు సేవలు అందించడంలో నిబద్ధతతో పనిచేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ తిరువూరు డివిజన్లో 53, నందిగామ డివిజన్‌లో 46, విజయవాడ డివిజన్లో 37 రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్‌కే) ధాన్యం కొనుగోలు కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 23,21,400 గోనె సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 70,156 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని.. రైతులకు దాదాపు రూ. 146 కోట్ల నగదు మొత్తాన్ని 24 గంటలలోపే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఎస్.ఇలక్కియ వెల్లడించారు..
