తెలంగాణలో పోరాట శక్తి ఉన్న యువతకు కొదవ లేదు
అలాంటి యువతకు జనసేన సిద్ధాంతాలు బలాన్నిస్తాయి
జన సైనికులు తెలంగాణకు భవిష్యత్తు కావాలి
తెలంగాణలో పార్టీ నిర్మాణం వారి చేతుల్లోనే ఆధారపడి ఉంది
ఏదో ఒక రోజు తెలంగాణలో జనసేన కీలక పార్టీగా అవతరిస్తుంది
కొండగట్టులో తెలంగాణ నాయకులు, కార్యకర్తల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
తెలుగు ట్రాక్,హైదరాబాద్:
తెలంగాణలో తెగింపు, ధైర్యం, పోరాట శక్తి ఉన్న యువతకు కొదవ లేదు. అలాంటి యువతకు బలమైన సిద్ధాంతం తోడైతే ఎదురుండదు. జనసేన ఏడు మూల సిద్ధాంతాలు మీ అందరికీ బలాన్నిస్తాయి. మీరంతా సమర్ధవంతంగా పని చేస్తే ఏదో ఒక రోజు తెలంగాణలో జనసేన పార్టీ కీలక పార్టీగా అవతరిస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జన సైనికులు తెలంగాణకు భవిష్యత్తు కావాలని, తెలంగాణలో పార్టీ నిర్మాణం అనేది వారి చేతుల్లోనే ఉందని తెలిపారు. శివ అనే చెంచు యువకుడు సైద్ధాంతిక బలంతో ముందుకు కదిలితే సమస్య ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కదిలించింది… నాకు డబ్బు ఉన్న నాయకులు కాదు… శివ లాంటి దమ్మున్న నాయకులే కావాలని చెప్పారు. నాకు బలహీనమైన వ్యక్తులు వేల మంది అవసరం లేదనీ, పార్టీ కోసం బలంగా నిలబడే 150 మంది చాలన్నారు. కొండగట్టు పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “తెలంగాణలో కలల ఖనిజాలతో చేసిన యువత పుష్కలంగా ఉంది. అలాంటి యువతకు సైద్ధాంతిక బలాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గెలుపు, ఓటమి గురించి ఎవరూ ఆలోచించవద్దు. తెలంగాణకు మీరంతా భవిష్యత్తు కావాలి. మీ సమర్ధతే మీ విజయానికి బాటలు వేస్తుంది. నా అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా వచ్చి మాట్లాడుతా. నాకు పోరాట స్ఫూర్తి ఇచ్చిన నేల తెలంగాణ. ఇది దైవం పట్ల, దేశం పట్ల భక్తి చూపిన నేల. అలాంటి నేలలో పుట్టిన పార్టీ జనసేన. ఇదే నేల నాకు పునర్జన్మనిచ్చింది. హైటెన్షన్ వైర్లు తలకి తాకితే పది నిమిషాలు స్పృహ కోల్పోయా. ఆ ఘటన జరగడానికి 4 నెలల ముందే ఎవరో వచ్చి మృత్యుగండం ఉందని చెబితే భగవంతుడి మీద భారం వేసి వదిలేశా. నాకు ఈ కొండగట్టు పునర్జన్మనిచ్చింది. రాజకీయాల్లోకి నేను ఎలాంటి పదవులు ఆశించి రాలేదు. నేను పుట్టిన నేలకు, దేశానికి సేవ చేయాలనే వచ్చానన్నారు.
• అడవి తల్లి బాటకు ఆదిలాబాద్ స్ఫూర్తినిచ్చింది
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే పార్టీ పెట్టా. అప్పట్లో ఇక్కడ నాయకత్వం కూడా నిప్పు కణికల్లా ఉండేవారు. మీరంతా అలాగే ఉండాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 143 మంది పోటీ చేస్తే 53 మంది గెలిచారు. ఎంత పెద్ద ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్నారు. గిరిజన గ్రామాలను కలుపుతూ రోడ్లు వేసే అడవి తల్లిబాట కార్యక్రమానికి కూడా మన ఆదిలాబాదే స్ఫూర్తిచ్చిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో తెలంగాణకు మేలు
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలసలు పెరిగితే ఇక్కడ ఉన్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో అభివృద్ధి జరిగితే ఇక్కడకు వలసలు ఆగిపోతాయన్నారు. . ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో తెలంగాణ యువతకు మేలు జరుగుతుంది. ఈ రాష్ట్రానికీ మంచి జరుగుతుందన్నారు. . అందుకే ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువ దృష్టి సారించామని తెలిపారు.
• నేను లెఫ్టిస్టునీ, రైటిస్టునీ కాదు.. సెంట్రలిస్టుని..
సిద్ధాంతపరంగా లెఫ్టో, రైటో ఏదో ఒకటి తేల్చుకోవడం చాలా తేలిక. బ్యాలెన్స్ గా నిలబడడం కష్టం. అలా నిలబడడం నేను తెలంగాణ సాయుధపోరాటం నుంచి నేర్చుకున్నాను. నన్ను విమర్శించే వారు.. నాకంటూ ఓ సిద్ధాంతం లేదంటారు. నేను సెంట్రలిస్టుని. కమ్యునిస్టు, మార్కిస్టు దేశం అయిన చైనానే క్యాపిటలిస్టుగా మారిపోయిందన్నారు. . ఈ ప్రపంచంలో డబ్బు ఉన్నవాడే ఉండకూడదు అన్నది వామపక్ష సిద్ధాంతం. కమ్యునిస్టు దేశం చైనానే క్యాపిటలిస్టుగా మారిపోయినప్పుడు అలాంటి సిద్ధాంతాలు సాధ్యపడతాయా? నాతో ఎంతో సన్నిహితంగా ఉండే గద్దరన్న సైద్ధాంతికంగా మాత్రం నాతో ఏకీభవించే వారు కాదు. జనసేన పార్టీతో సేను సెంట్రలిస్ట్ సిద్ధాంతాన్ని ఒక ఎక్సపెర్మెంట్ గా తీసుకుని ముందుకు వెళ్లా. అది పని చేయడం వల్లే నేను ఉపముఖ్యమంత్రి అయ్యాను. కమ్యునిస్టు చైనా కేపిటలిస్ట్ అయినప్పుడు ఇది ఎందుకు సాధ్యపడదు అనిపించింది. అంతేకాదు గద్దర్ లాంటి వారు జీవిత చరమాంకంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వెలుపల కూర్చుని పాటలు కూడా పాడారని గుర్తు చేశారు.
. నక్సలిజం పేరిట యువత చనిపోతుంటే బాధ కలుగుతుంది. అలాంటి యువత పంచాయతీ స్థాయిలో బలంగా నిలబడితే దోపిడీకి ఆస్కారం లేని ప్రగతి సాధ్యపడుతుంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రాష్ట్రం కోసం జరిగిన పోరాటం వరకు నేను తెలంగాణ తాలూకు ఆత్మను ఆర్ధం చేసుకున్నాను. రాష్ట్రం కోసం ఇంత మంది రోడ్ల మీదకు రావడం, శ్రీకాంతాచారి లాంటి వారి బలిదానాలు ఇక్కడ యువత ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత బలంగా నిలబడతారో చూపింది. మీ అందరిలో బలమైన మార్పుని ఆశిస్తున్నానన్నారు.
• నేను రాజ్యాంగానికి మాత్రమే కొమ్ము కాస్తా..
సనాతన ధర్మం స్థానికంగా ఉండే సంస్కృతి ఆధారంగా ఉంటుంది. దేశంలో మెజారిటీ శాతం ప్రజలు పాటించే హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన నేను ఇస్లాంను వ్యతిరేకించినట్టు కాదు. నేను ఏ వర్గానికి, మతానికి కొమ్ముకాయను. రాజ్యాంగానికి మాత్రమే కొమ్ముకాస్తాను. సెక్యులరిజం అంటే హిందువులను తిట్టడం కాదు. ముస్లింలలోనూ నన్ను ప్రేమించే వారు ఉన్నారు. నేను ఏ మతాన్ని ద్వేషించను. హిందూ దేవుళ్లపై చేస్తున్న అసత్య ప్రచారాలు తప్పు అన్నందుకు నా మీద మత ముద్ర వేసేస్తారు. అలాంటి పద్దతి మారాలి” అన్నారు.
• తెలంగాణ జనసేన పార్టీలోకి చేరికలు
తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనలో భాగంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మచ్చా సుధాకర్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మంథాని సంపత్ కుమార్, మహబూబాబాద్ కి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ దాసరి రవీష్ తదితరులు శనివారం పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికీ పవన్ కళ్యాణ్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సుధాకర్ గతంలో బీఆర్ఎస్ స్టేట్ ఎగ్జికూటివ్ మెంబర్ గా పని చేశారు. సంపత్ కుమార్ 2011 నుంచి 2014 వరకు చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గా పని చేశారు.
