
జగనన్న సంక్షేమ రాడార్ ఇది..
అర్హత ఉన్నవాళ్లెవరూ లబ్ధి పొందకుండా ఉండేందుకు వీల్లేదు
ఐదు దశల్లో కార్యక్రమం అమలు
ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు
స్పెషలిస్టు డాక్టర్లే గ్రామాలకు వస్తారు
విజయవతంగా వాలంటీర్ల సర్వే
మొదలైన సీహెచ్ వో, ఏఎన్ఎంల బృందం సర్వే
ప్రజలంతా జగనన్న ఆరోగ్య సురక్ష ను వినియోగించుకోవాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని


అమరావతి:
జగనన్న ఆరోగ్య సురక్ష.. ప్రజలందరికీ రక్ష అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం మంత్రి విడదల రజిని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ రోజు ఏకంగా 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నాయి. అంటే తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎంతగా బలోపేతం చేసిందో , ఏ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ఇప్పటి వరకు 2.30 కోట్ల ఓపీలు నమోదయ్యాయని, ఇది ఒక చరిత్ర అని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం దాదాపు 8,500 కోట్ల రూపాయాల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను కొత్తగా నిర్మిస్తోందన్నారు. ఈనెల 15న జగనన్న ఐదు మెడికల్ కళాశాలలను విజయనగరం నుంచి పారంభించారని గుర్తు చేశారు. మరో రెండేళ్లలో మిగిలిన 12 కళాశాలలను కూడా పూర్తిచేసి ప్రారంభిస్తామన్నారు.
ఇంటింటికీ వాలంటీర్ల బృందం
జగనన్న సంక్షేమ రాడార్ నుంచి ఎవరూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపుదిద్దుకుందన్నారు. మొత్తం ఐదు దశల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మొదటి దశలో వాలంటీర్ల ఇంటింటి సర్వే ఈ నెల 15వ తేదీన ప్రారంభమైందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, ఎన్ ఎస్ ఎస్, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తల బృందం తొలి దశలో గ్రామాల్లో ఇంటింటికీ వెళుతుందని చెప్పారు. ఈ బృందం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీహెచ్‌వో గాని, ఎఎన్ ఎంగాని అదే ఇంటికి ఎప్పుడు వస్తారో చెప్పి.. ఆ రోజు కచ్చితంగా ఇంటి వద్దనే ఉండాలని వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ కి సంబంధించిన అవగాహనా పత్రాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ఈ పథకం గురించి పూర్తిస్థాయిలో చైతన్యం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆస్పత్రులు ఏంటి..? ఆ ఆస్పత్రులు అందించే సేవల వివరాలు.. ఇలా అన్ని విషయాలు వాలంటీర్ల బృందం అందరి ఇళ్లకు వెళ్లి ఇప్పటికే గ్రామాల్లో వివరిస్తున్నారని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసి అందరి సెల్‌ఫోన్లలో అందుబాటులో ఉండేలా వాలంటీర్లు ఈ క్యాంపెయిన్‌లో చొరవచూపుతున్నారని పేర్కొన్నారు. ఒక్కో వాలంటీర్ ఎంతమందితో ఆరోగ్యశ్రీ యాప్‌లు డౌన్ లోడ్ చేయించారనే దాన్ని బట్టి ఆ వాలంటీర్ పని మదింపు జరుగుతుందని వివరించారు.
ఏడు రకాల టెస్టులు
మంత్రి విడదల రజని మాట్లాడుతూ రెండో దశలో భాగంగా సీహెచ్ వో , ఎఎన్ ఎంలు రెండు బృందాలుగా ఏర్పడి అందరి ఇళ్లకు వెళతారని చెప్పారు. ఈ బృందంలో ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు కూడా ఉంటారని తెలిపారు. కార్యక్రమం ఇప్పటికే ఈ రోజు నుంచి ప్రారంభమైందని,ఆశాజనకంగా ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. సీహెచ్‌వో బృందం సగం ఇళ్లను, మరో సగం ఇళ్లను ఎఎన్ ఎం బృందం వారి వారి గ్రామాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఈ బృందాలు ఇళ్లకు వెళ్లి.. ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని గుర్తిస్తాయని పేర్కొన్నారు. బీపీ, మధుమేహం, హిమోగ్లోబిన్ లాంటి పరీక్షలను రోగుల అంగీకారం మేరకు చేస్తారని తెలిపారు. యూరిన్, స్పుటమ్, అవసరాన్ని బట్టి మలేరియా, డెంగీ టెస్టులు చేస్తారని వెల్లడించారు. మొత్తం ఏడు రకాల వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు. వీళ్లు కూడా మరోసారి ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు.
పలు విభాగాల సమన్వయంతో…
మంత్రి మాట్లాడుతూ మూడో దశలో భాగంగా వాలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సేవాభావం కలిగిన వ్యక్తుల బృందం మరోసారి ఇంటింటికీ వెళతారన్నారు. ఆ గ్రామంలో నిర్వహించే వైద్య శిబిరం తేదీ, వైద్య శిబిరంలో అందించే సేవల గురించి వివరిస్తారన్నారు. టోకెన్లు అందజేసి కచ్చితంగా శిబిరానికి హాజరయ్యేలా చూస్తారన్నారు. పలు విభాగాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో, తహశీల్దార్ మార్గదర్శకాల మేరకు వైద్య శిబిరాలను ఏర్పాటుచేస్తారన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు గ్రామంలోని బాలింతలు, గర్భిణులు, శిశువులు.. ఇలా అందరి వివరాలను ఎఎన్ ఎంలకు అందజేస్తారని, వీరంతా కచ్చితంగా వైద్య శిబిరానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు
ఒక్కో వైద్య శిబిరంలో నలుగురేసి చొప్పున డాక్టర్లు
మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ నాలుగో దశలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 542 అర్బన్ ప్రైమరీ హెల్త్ క్యాంపుల పరిధిలో వైద్య శిబిరాలను నిర్వహించబోతున్నామన్నారు. ఈ నెల 30 నుంచి శిబిరాలు మొదలుపెట్టి.. 45 రోజుల్లోగా పూర్తయ్యేలా పక్కా ప్రణాళిక రూపొందించామన్నారు. శిబిరాల్లో వైద్యులు రోగులను పరీక్షిస్తారని, అవసరమైన వారికి మందులను అందజేస్తారని వివరించారు. ఒకవేళ రోగులకు చికిత్స అవసరమైతే వారిని రాష్ట్రంలోని సెకండరీ ఆస్పత్రులకుగాని, టెర్షియరీ ఆస్పత్రులకు గాని, ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే ఆస్పత్రులకు గాని రిఫర్ చేస్తారన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో, తహశీల్దార్, పీహెచ్‌సీల వైద్యాధికారులు ఈ వైద్య శిబిరాల పూర్తి బాధ్యత తీసుకుంటారని, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఆరోగ్య అధికారులు, యూపీహెచ్‌సీల వైద్యాధికారులు ఈ వైద్య శిబిరాల బాధ్యత తీసుకుంటారని వివరించారు. ప్రతి వైద్య శిబిరంలో నలుగురు డాక్టర్లు వైద్య సేవలు అందజేస్తారన్నారు. వారిలో ఇద్దరు పీహెచ్‌సీ డాక్టర్లు అంటే పీహెచ్‌సీ పరిధిలోని ఫ్యామిలీ డాక్టర్, అదే పీహెచ్‌సీలో ని మరో వైద్యాధికారి ఈ శిబిరంలో ఉంటారని తెలిపారు. మరో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు ఉంటారని, వీరిలో ఒకరు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రి నుంచి మరొకరు డీఎంఈ నుండి గాని, డీఎస్ హెచ్ ఆస్పత్రుల నుంచి గాని వస్తారని చెప్పారు. ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లలో ఒకరు కచ్చితంగా మహిళా డాక్టర్ ఉంటారని తెలిపారు.
రోగి కోలుకునే వరకు..
మంత్రి రజని మాట్లాడుతూ ఐదో దశలో ఆ గ్రామానికి చెందిన ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వో, ఎఎన్ఎంలు రిఫరల్ కేసులకు సంబంధించిన రోగులకు ఫాలో అప్ వైద్యం అందిస్తారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఈ రోగులకు సరైన వైద్యం అందిందా.. లేదా.. రోగం పూర్తిగా అదుపులోకి వచ్చిందా లేదా.. పరిశీలిస్తారని వివరించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు సిఫారసు చేసిన ప్రతి రోగి జబ్బు పూర్తిగా నయమయ్యాకే వారి కేసు ఆన్‌లైన్‌లో పూర్తయినట్లు లెక్క అని వివరించారు.
నకిలీ ఎల్వోపీలపై విచారణ
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి రజని సమాధానం చెప్పారు. నకిలీ మందుల విషయంలో కఠినంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇందుకు సంబంధించిన సంఘటనలు వెలుగులోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీజీ సీట్ల విషయంలో నకిలీ ఎల్వోపీలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఇది పూర్తిగా ఎన్ ఎంసీ పరిధిలోని అంశం అవడంతో వారి ద్వారా విచారణ కోరామన్నారు. తమ ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఎన్ ఎంసీ కి సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఆరునెలలకోసారి చేపట్టే ఆలోచన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిఫా వైరస్ విషయంలో తమ ప్రభుత్వం అప్రమత్తతో ఉందని, సంబంధించిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల డీహోస్మని, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ డాక్టర్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.