అధికారిక ఉత్తర్వులు జారీ ..
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా విశాఖను చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తన మాట నెగ్గించుకునేందుకు అధికారికంగా జీవో విడుదల చేశారు. విజయదశమి నుండి విశాఖ పట్నం లోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో నంబర్ 2015 ను విడుదల చేశారు. అయితే అందులో రాజధానిగా అని కాకుండా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు ,ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అని వెల్లడించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు కార్యాలయాలు,నివాస స్థలాలను ఏర్పాటు చేసేందుకు చర్యలను ప్రారంభించింది. సీఎంఓ అధికారులతో పాటు,సీనియర్ అధికారులు, అన్ని శాఖల అధిపతులు విశాఖలో ఉండేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వం ఓ కమిటీ ని ఏర్పాటు చేసింది.

గతంలో హైదరాబాద్ నుండి అమరావతి వచ్చినప్పుడు ఉద్యోగులకు గత ప్రభుత్వం అమరావతి పూర్తి ఏర్పాట్లను చేసింది. ఉద్యోగులకు ప్రభుత్వం కావాల్సిన సహాయ సహకారాలు అందించింది. ఇప్పుడు కూడా అమరావతి నుండి విశాఖకు వెళ్లేందుకు ఉద్యోగస్తులకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే అన్ని శాఖల్లోని ఉద్యోగులను మానసికంగా సిద్ధం చేసినట్లు కనిపిస్తుంది. ఈ నెల 16 వ తేదీన ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనలో క్యాంపు ఆఫిస్ ను సందర్శించే అవకాశం ఉంది. తర్వాత దసరా రోజున అధికారికంగా విశాఖలో తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.