ప్ర‌తి అర్జీపైనా దృష్టిపెట్టండి

Telugu Track
Spread the love

తెలుగు ట్రాక్,విజయవాడ:
ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) కార్య‌క్ర‌మం ద్వారా ప్రజల నుంచి అందుతున్న ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి.. సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు.
సోమ‌వారం కలెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. రెవెన్యూ సేవ‌ల‌తో పాటు ఇళ్ల స్థ‌లాలు, ఇళ్ల మంజూరు, ఉపాధి, పెన్ష‌న్ మంజూరు త‌దిత‌రాల‌కు సంబంధించి మొత్తం 202 అర్జీల‌ను స్వీక‌రించ‌గా వీటిలో రెవెన్యూకు సంబంధించి 49, పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధికి సంబంధించి 40, వైద్యఆరోగ్యానికి సంబంధించి 23, డీఆర్‌డీఏకు సంబంధించి 15, పోలీసు శాఖ‌కు సంబంధించి 12, విద్యుత్ శాఖ‌కు సంబంధించి 9 అర్జీలు ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రతి అర్జీని లోతుగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించి, తీసుకున్న చర్యల వివరాలను అర్జీదారులకు స‌రైన‌విధంగా తెలియజేయాలని ఆదేశించారు.
పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో నిలిచేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా భూసంబంధిత సమస్యలు, తాగునీరు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని సూచించారు.
కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ నాంచార‌రావు, వివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *