సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ పిలుపు

తెలుగు ట్రాక్,నవంబరు. 26
“రాజ్యాంగ స్ఫూర్తి” తో పాత్రికేయులు తమ వృత్తిని కొనసాగించాలని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ కోరారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత రాజ్యాంగం 19 (1-ఎ) అధికరణం లో భావ ప్రకటన స్వేచ్ఛ రూపంలో అందించిన “పత్రికా స్వేచ్ఛ” ను నిజమైన స్పూర్తితో కొనసాగించాలని ఆయన పిలుపు నిచ్చారు. అదే సందర్భంలో ఆర్టికల్ 19 (2) లో పేర్కొన్న మినహాయింపుల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని కోరారు. న్యాయవ్యవస్థ తీర్పులకు సంబంధించి అంశాల పై వార్తలు రాసేటప్పుడు న్యాయవ్యవస్థ ప్రతిష్ట కు భంగం కలగకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
జర్నలిజం ప్రమాణాలు పెంపొందించే దిశగా సి.ఆర్. మీడియా అకాడమీ తన వంతు ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఇందుకోసం విలేఖరులకు పునశ్చరణ తరగతులు నివహిస్తోన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా తో పాటు గుంటూరు,ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల లో విలేఖరులకు పునశ్చరణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు.
రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం స్థానిక సి.ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో “రాజ్యాంగ పీఠిక” ను సిబ్బంది అధికారులచే వల్లెవేయించారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.మీడియా అకాడమీ అధికారులు ఎం. భాస్కర నారాయణ, శాంతారాం, లోవ రాజు, జాలిరెడ్డి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
