సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యతాంశాలివే
20 లక్షల ఉద్యోగాల కల్పనకే మొదటి ప్రాధాన్యత
స్వర్ణాంధ్ర-2047, 10 సూత్రాల అమలుపై నోడల్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
తెలుగు ట్రాక్,అమరావతి, డిసెంబరు 24: స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో భాగంగా పౌరులకు మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రతీ ప్రభుత్వ శాఖ ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన కోసం రూపొందించిన పది సూత్రాలను పది మిషన్లుగా నిర్దేశించుకుని పనిచేయాలని సీఎం సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా శాఖల నోడల్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. మిషన్ ఫ్రేమ్ వర్క్ రూపకల్పన, ఆయా ప్రభుత్వ శాఖలు మెరుగైన పనితీరు కోసం ముఖ్యమైన ఇండికేటర్లను గుర్తించి వాటికి అనుగుణంగా పనిచేయాలని సీఎం సూచించారు. జీరో పావర్టీ మిషన్లో భాగంగా పీ4 విధానాన్ని ముందుకు తీసుకెళ్లటంతో పాటు వాటి అమలును విజన్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ కుటుంబమూ సాధికారిత సాధించాలని అలాగే వ్యక్తులకు ఆర్ధిక భద్రత కల్పించటమే ఈ మిషన్ ముఖ్య లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో ఉన్న దాదాపు 30 లక్షల బీపీఎల్ కుటుంబాలకు ఎంత ప్రయోజనం కలిగిందో అంచనా వేయాలని సూచించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఓ విధానాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నైపుణ్యాలు ఉద్యోగాల కల్పన అనేది అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. మొట్టమొదటి ప్రాధాన్యతగా 20 లక్షల ఉద్యోగాలను కల్పించటమే లక్ష్యంగా పని చేయాలన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో ఉంచాలని సూచించారు. పది సూత్రాలకు సంబంధించిన అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని అన్నారు. కీలక మిషన్ గా నీటి భద్రత అంశంపైనా ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. నీటి వనరుల సమర్ధ వినియోగంతో పాటు నీటి ఆడిట్ నిర్వహించాలని సూచించారు. నీటి వినియోగంలో ఎక్కడా వివాదాలు లేకుండా చూడాలని.. రెండు తెలుగు రాష్ట్రాలూ సస్యశ్యామలంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కరవు అనే మాట లేకుండా వరద నీటి నిర్వహణ జరగాలని సూచించారు. టెక్నాలజీ వినియోగంతో… సాగు వ్యయం తగ్గేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిమాండ్ ఆధారిత పంటల ఉత్పత్తి, కోల్డ్ చైన్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి అంశాలపై దృష్టి పెట్టి రైతులకు ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.
స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలు
