పీపీపీ విధానంపై ముందుకే..

telugu track
Spread the love

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి
కేంద్ర మార్గదర్శకాల మేరకు విజీఎఫ్‌కు నిర్ణయం
వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

తెలుగు ట్రాక్,అమరావతి,డిసెంబర్ 24:
పేదలకు నాణ్యమైన మెడికల్ విద్యను, వైద్యాన్ని అందించే విషయంలో ఎక్కడా రాజీ పడేది, వెనక్కి తగ్గేది ఉండదని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రస్తావనకు వచ్చింది. దేశ వ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని.. పేద వర్గాలకు నాణ్యమైన, కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో పీపీపీ విధానంలో ముందుకువెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు.సమీక్ష సందర్భంగా పీపీపీ విధానంలో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం, మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వ సూచనలను, మార్గదర్శకాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పీపీపీ ప్రాజెక్టుల అమలును ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం, ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా పలు విధానపరమైన ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో అమలులో ఉన్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద… సామాజిక–ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పీపీపీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద అందించే ఆర్థిక చేయూతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని కేంద్రం సూచించిందని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా వైద్య రంగంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇచ్చే 60 శాతం ఆర్థిక మద్దతులో చెరో 30 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. వీజీఎఫ్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆసుపత్రులు, వైద్య కళాశాలు నిర్మించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని చెప్పారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం పీపీపీ విధానాన్ని ప్రోత్సాహిస్తోందని అధికారులు వివరించారు. దీని ద్వారా వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వంటి కీలక ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అభిప్రాయ పడినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *