దూసుకొస్తున్న మిచాంగ్‌ తుఫాను

Spread the love

డిసెంబర్‌ 4న చెన్నై, మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం
భారత వాతావరణ కేంద్రం వెల్లడి

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్‌ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. ఇటీవల బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఈ వాయుగుండం శనివారం నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత వాయవ్య దిశగా పయనించి డిసెంబర్‌ 4న తెల్లవారుజామున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ నడుమ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.తుఫాన్‌ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతోపాటు పలు జిల్లాల్లో నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. దాంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేటి నుంచి మరో నాలుగు రోజులపాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, నాగపట్నం, రామనాథపురం, చెన్నై ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు. చెన్నైలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెన్నై కార్పొరేషన్‌ ప్రారంభించిన 1913 హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌కు కూడా సమాధానం ఇచ్చారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు కూడా ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.తుఫాను తీరంవైపు దూసుకొస్తుండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాలు కురవనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సహాయక బృందాలను కూడా సిద్ధం చేశారు. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: