చంద్రబాబుకు హాస్పిటల్ కు తరలిస్తారా ?

లోకేష్,భువనేశ్వరి,బ్రాహ్మణి లు చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ అయ్యారు. గతంలో చంద్రబాబును కలిసిన ప్రతి సారీ భువనేశ్వరి కానీ,లోకేష్ కానీ మీడియా తో మాట్లాడి వెళ్ళేవాళ్ళు కానీ గత రెండు దఫాలుగా లోకేష్ ములాఖత్ అనంతరం ఎవ్వరితో మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు. ఈ రోజు కూడా బయటకి వచ్చిన తర్వాత అక్కడ వేచి వున్న తెలుగుదేశం నాయకులతో మాత్రమే రెండు నిముషాలు మాట్లాడి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడాలని అడిగిన రాకుండానే వెళ్లిపోయారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జైలు అధికారులు ప్రతిరోజూ హెల్త్ బులెటిన్ లు విడుదల చేస్తున్నారు.అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేదని వైద్య రిపోర్టులు పూర్తిగా తమకు ఇవ్వాలని ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటీషన్ వేశారు. అదే విషయాన్ని ఈ రోజు తెలుగుదేశం నాయకులు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మీడియా తో చెప్పారు. ఆయన ఆరోగ్యం ఆందోళనగా ఉందని తెలిపినట్లు చెప్పారు. చంద్రబాబును వెంటనే కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు . ములాఖత్ లో చంద్రబాబు ను చూసిన భువనేశ్వరి భావోద్వేగానికి గురైనట్లు వెల్లడించారు.బయటకు వచ్చిన లోకేష్ కూడా ముభావంగా కనిపించారు. కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో శుక్రవారం సుప్రీం కోర్టులో తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.