కల్వకుర్తి:తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్న కెసిఆర్ ను,తమ ప్రభుత్వం వచ్చాక తిరిగి వసూలు చేసి పేద ప్రజలకే పంచుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సీఎం కేసీఆర్ కనీసం ఒక్కసారైనా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి సవిూక్షించాలని రాహుల్ గాంధీ అన్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ విజయ భేరీ సభలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు ఒకదాని తర్వాత ఒకటి కుంగిపోతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచి, లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. ఈ రోజు ఈ ప్రాజెక్టు వద్దకు వెళ్లి సవిూక్షించాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రాజెక్టును కూడా సరిగా నిర్మించలేకపోయారని అన్నారు.
ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములను ఈ దొరల ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. ధరణి వల్ల ఇరవై లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందన్నారు. దీని వల్ల కేవలం ఒక కుటుంబానికి.. ఒక వ్యక్తికి మాత్రమే లాభం జరుగుతోందని, కానీ యావత్ తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు. కేసీఆర్ ఎంత డబ్బు ప్రజల నుంచి లూటీ చేశారో, ఆ ధనాన్ని కాంగ్రెస్ అదే పేద ప్రజలకు ఇస్తుందన్నారు.
ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్నాయన్నారు. కానీ వాస్తవమేమంటే బీఆర్‌ఎస్, బీజేపీ, మజ్లిస్ ఒక్కటిగా పని చేస్తున్నాయన్నారు. పార్లమెంట్లో ప్రతి బిల్లుకు బీఆర్‌ఎస్… బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు.
కేసీఆర్ లూటీ చేసిన డబ్బు పేద ప్రజలకు ఇస్తాం
