
అసలు చంద్ర బాబు ను ఎందుకు అరెస్ట్ చేశారు ?స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రాధమికంగా చంద్రబాబును ఎలా దోషిగా అనుమానించారు ? ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేసి కస్టడీ కి ఇవ్వాలని ఏపీసిఐడి నిర్ణయం తీసుకుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఆదివారం ఒక వార్త బయటకు వచ్చింది.
అదేంటంటే గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన పీవీ రమేష్ సి ఐ డి అధికారులకు ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. అందులో తానూ వద్దని వారించినా వినకుండా చంద్ర బాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఉన్నట్లు ఆయా కంపెనీలకు నిధులు మంజూరు చేశారని ఆ వార్తలో వుంది. ఇదే విషయాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబు పై కేసులో సెక్షన్ లు పెట్టారని వార్తలొచ్చాయి. సుదీర్ఘ వాదనలు విన్న తర్వత ఏ సి బి కోర్టు సి ఐ డి వాదనలతో ఏకీభవించి చంద్రబాబును రిమాండుకు పంపారు. చంద్రబాబు ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు.
అయితే సోమవారం మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం అప్పటి అధికారి పీవీ రమేష్ సీఐడీ వాదనలలో తన పాత్రపై వచ్చిన వార్తలను ఖండించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చెప్తున్న నిధుల మంజూరును అప్పట్లో బడ్జెట్ లో ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు. ఆ తర్వాత అంతా అప్పటి అధికారులదే భాద్యత అని అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు పెట్టామనడం దిగ్భ్రాంతికరం : పీవీ రమేశ్
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తన స్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, గతంలో ఏపీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన పీవీ రమేశ్ అన్నారు. ఈ కేసుపై గతంలో ఆయన సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. తాజాగా తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్ తదితర పరిణామాల నేపథ్యంలో పీవీ రమేశ్ స్పందించారు.
ఎండీ, కార్యదర్శి పాత్రే ప్రధానం.. వారి పేర్లేవీ? : ‘‘నా వాంగ్మూలంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారనడం హ్యాస్యాస్పదం. నేను అప్రూవర్‌గా మారారనే ప్రచారం అవాస్తవం. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు?స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఆర్థికశాఖ ఏ తప్పూ చేయలేదు.. నేను చెప్పింది సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానం. గతంలో నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు కేసులో లేవు. స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ, కార్యదర్శి పాత్రే ప్రధానం.. వారి పేర్లు ఎందుకు లేవు? అని ప్రశ్నించారు.
అధికారులను కాకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటి? : సీఎంగా ఉండేవారు కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారు. ఆయా శాఖల అధికారులే ప్రధాన బాధ్యత వహించాలి. ప్రతి బ్యాంక్ అకౌంట్‌లో ఏం జరుగుతుందో సీఎంకి ఏం తెలుస్తుంది? ఆనాడు విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్ ఏమయ్యాయి? స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫైల్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. సీఎం అధికారుల మీద ఒత్తిడితెచ్చి డబ్బులు రిలీజ్ చేయించడం జరగదు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై రాసిన నోట్ ఫైల్స్ ఏమయ్యాయి?’అని పీవీ రమేశ్ ప్రశ్నించారు.