భీకర యుద్ధం

israel iran war
Spread the love

పశ్చిమాసియా లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి
40 మంది విద్యార్థులు మృతి
దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి
సుప్రీం లీడర్ ఖమేనీ ఆఫీస్ పై దాడి
అమెరికా స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడితో పశ్చిమాసియాలో భీకర యద్ధం జరుగుతుంది. అణు ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు విఫలం కావడంతో యద్ధానికి దారితీసింది. తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినా ఇరాన్ పట్టించుకోలేదు. దీంతో శనివారం ఉదయం ఇజ్రాయెల్ భూ భాగం నుంచి అమెరికా దాడులు ప్రారంభించి,ఇరాన్ పై దాడులకు పాల్పడింది.
ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి
40 మంది విద్యార్థులు మృతి
మినాబ్‌లో ఇరాన్ పారా మిలటరీ రివల్యూషనరీ గార్డ్ స్థావరం ఉండటంతో దానిపై దాడులు జరిగాయి. అయితే ఆ ప్రాంతానికి సమీపంలో ఓ బాలికల పాఠశాల కూడా ఉంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ఈ పాఠశాల తీవ్రంగా ధ్వంసమైంది. కనీసం 40 మంది బాలికలు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. పదుల సంఖ్యలో పిల్లలు తీవ్ర గాయాల పాలైనట్టు సమాచారం. ఈ దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. మీ విధిని మీరే లిఖించుకోవాలని, 1979 నుంచి దేశాన్ని పాలిస్తున్న ఇస్లామిక్ నాయకత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాలని ఇరాన్ పౌరులకు పిలుపునిచ్చారు
అమెరికా స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం
టెహ్రాన్‌పై జరిగిన దాడులకు ప్రతిగా ఇరాన్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించింది. అలాగే పలు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాక్, జోర్డాన్, యూఏఈ సహా 10 దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పరిణామాలతో ఇరాన్, ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి.
దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా శనివారంనాడు చేపట్టిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మిటలరీ ఆపరేషన్స్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అమీర్ నాసిర్జాదే 2024 ఆగస్టు నుంచి ఇరాన్ రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇరానియన్ సాయుధ దళాల డిప్యూటీ ఆఫ్ స్టాఫ్‌గా, ఇరాన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌గా సేవలందించారు. ఇదే దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమామండర్ మహమ్మద్ పాక్పైర్ కూడా మరణించినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఇరాన్ మాత్రం ఇంకా స్పందించాల్సి ఉంది.
సుప్రీం లీడర్ ఖమేనీ ఆఫీస్ పై దాడి
ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా టెహ్రాన్‌పై దాడులకు దిగాయి. టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. అయితే ఖమేనీ అంతకు ముందే సురక్షితంగా తప్పించుకున్నట్టు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ లక్ష్యంగానే ఈ దాడులు జరిగినట్టు కథనాలు వెలువడుతున్నాయి.
అబుదాబిలో చిక్కుకున్న తెలుగు ప్రజలు
అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది. ఈ విమానంలో సుమారు 100 మందికి పైగా తెలుగువాళ్లు ఉన్నారు. అభుదాబి ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్‌పై ఈ రోజు మధ్యాహ్నం ఇరాన్ వైమానిక దాడులు జరిపింది.
ఎయిర్ బేస్‌పై మరిన్ని దాడులు జరుగవచ్చోమోనని అభుదాబిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో అబుదాబి గగనతలాన్ని అక్కడి ప్రభుత్వం మూసివేసింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. తీవ్ర ఆందోళనలో తెలుగు ప్రయాణికులు ఉన్నారు. హోటల్‌కు పంపతామని ఇతిహాద్ సిబ్బంది చెప్పారని… అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుగు ప్రయాణికులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *