- అత్యున్నత విద్యా నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
- ఎన్‌టీఆర్ జిల్లాలో రూ. 23 కోట్లు విలువైన 13,118 ట్యాబ్‌ల పంపిణీ
- విద్యార్థులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలి
- ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు

నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలు పొందాలంటే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అవసరమని భావించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తూ పేదల పిల్లలకు కూడా డిజిటల్ విద్యను చేరువచేస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
గురువారం విజయవాడ, పటమటలోని జీడీఈటీ మునిసిపల్ ఉన్నతపాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు హాజరై తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్, డీఈవో సీవీ రేణుక, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించారు. కలెక్టర్ డిల్లీరావు విద్యార్థులతో ముచ్చటించి బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ ట్యాబ్‌లపై వారికున్న అవగాహన స్థాయిని పరీక్షించారు. మెమరీ కార్డు, జీబీ, ర్యామ్ వంటి అంశాల గురించి అడిగారు. అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు 1,064; రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 12,054 మొత్తం దాదాపు రూ. 23 కోట్లు విలువైన 13,118 ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రూ. 15,500 విలువగల బైజూస్ కంటెంట్‌తో పాటు దాదాపు రూ. 17,500 మార్కెట్ విలువగల ట్యాబ్‌లను అందించడం జరుగుతోందని.. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విన్న తర్వాత బైజూస్ వీడియో పాఠాలు వింటే కాన్సెప్టులపై మంచి పట్టు ఏర్పడుతుందన్నారు. లెర్న్-ప్రాక్టీస్-రివైజ్‌కు వీలుకల్పించే 3డీ విజువల్ పాఠాల ద్వారా నేర్చుకున్న అంశాలు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. భవిష్యత్తులో కెరీర్ పరంగా మంచి అవకాశాలను అందుకోవాలంటే బాగా చదవాలని.. అందుకు ఈ ట్యాబ్‌లు ఉపయోగపడతాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న విద్యను అందించానే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ కంటెంట్ ట్యాబ్‌లను అందిస్తోందన్నారు. తమ పిల్లలు ట్యాబ్‌లను దుర్వినియోగం చేయకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు.. విద్యా శాఖ అధికారులతో కలిసి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.

విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి: తూర్పునియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ విద్యతోనే పేదరికం అంతమవుతుందని గుర్తించి.. గౌరవ ముఖ్యమంత్రి విద్యా రంగంలో అనేక పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నారని తెలిపారు. మనబడి నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారని.. జగనన్న గోరుముద్ద ద్వారా పోషకాలతో కూడిన ఆహారాన్ని ప్రత్యేక మెనూ ప్రకారం విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన ఇలా ఎన్నో పథకాలను కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తూ అమలుచేస్తోందన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్ సాంబశివరావు, ఎంఈవో విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.