
రాష్ట్రపతి ఆమోదం
ముగ్గురు సభ్యుల కమిషన్ లో మిగిలింది ఒక్కరే
మరో వారం రోజుల్లో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాల్సిన సమయంలో ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషనర్ రాజీనామా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. శనివారం నాడు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అరుణ్ గోయల్ రాజీనామాను ఆమోదించారు.ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. వెంట వెంటనే జరిగిన ఈ పరిణామాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది..
అరుణ్ గోయల్ కు 2027 వరకు పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఇంకా మూడేళ్లు పదవిలో ఉండే అవకాశం ఉన్నా కానీ పదవిని వదులుకోవడం వెనుక ఏమైనా రాజకీయ ఒత్తిడులు ఉన్నాయేమోనని చర్చ జరుగుతుంది. ఇప్పటికే ముగ్గురు సభ్యులు ఉండాల్సిన ఎన్నికల కమిషన్ లో ఇద్దరే ఉన్నారు. గత నెలలోనే అనూప్ పాండే ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. దాంతో సీఈసీ రాజీవ్ ,అరుణ్ మాత్రమే మిగిలి ఉన్నారు. సీఈసీ పదవీ కాలం కూడా వచ్చే ఫిబ్రవరిలో ముగియనుంది. ఒకవేళ అరుణ్ గోయల్ పదవిలోనే ఉంటే ప్రధాన ఎన్నికల అధికారి అయ్యే అవకాశం కూడా ఉండేది. ఇంత ఛాన్స్ వదులుకుని అరుణ్ గోయల్ రాజీనామా చేయటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.